-పాత్రికేయులకు, కుటుంబ సభ్యులకు తక్షణ వైద్యసేవలందించాలి
-నిమ్మరాజు వినతి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుమారు వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ గా రచయిత, బహుగ్రంథకర్త డాక్టర్ రమణ యశస్వి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, ఏపియుడబ్ల్యూజె ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఎస్.రవికుమార్, అక్రిడిటేషన్ కమిటీ మాజీ సభ్యులు భట్రాజు శాయి బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో కూడా రాత్రీపగలూ తేడాలేకుండా నిరంతరం జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు తక్షణం ఉన్నత వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గుంటూరు ఆసుపత్రి అభివృద్ధికి పలు చర్యలు చేపట్టారన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రొఫెసర్ రమణ అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఆంధ్ర వైద్య కళాశాలలో మెడిసిన్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్స్ లో ఎం.ఎస్ పూర్తిచేశారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి, నిజాంపట్నం పి.హెచ్.సీలో పనిచేసి, గుంటూరు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. ‘వాక్ ఫౌండేషన్’ సంస్థను స్థాపించి గత 18 ఏళ్ళలో దివ్యాంగులకు 8వేల వీల్ చైర్లు, కృత్రిమ కాళ్లు, చేతులు అందజేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు రంగాల ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.