-పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి
-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత డీఎస్సీ శిక్షణ పొందుటకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ, రవాణ, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణపై సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల ఎంపికకు జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, జనరేటర్ లు సిద్ధంగా ఉండాలని, కంప్యూటర్ సమస్యల పరిష్కారానికి సాంకేతిక సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.
అదేవిధంగా ఆ రోజున పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకు వీలుగా రవాణా సౌకర్యం కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
జిల్లాలో గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 10వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుందని, ఆ రోజున ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు షాహిద్ బాబు షేక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జి గీతాబాయి, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.