-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గదిలో ఉద్యానవనాలపై పార్క్ సూపర్వైజర్లతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, నిరంతరం పార్క్ లో ఉన్న హరితాన్ని పర్యవేక్షిస్తుండాలని, పరిశుభ్రతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, పార్కులో ఆట పరికరాలు ఏమైనా పాడైపోయినచో ఇంజనీరింగ్ సిబ్బందితో సమన్వయంతో పార్కులలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ప్రజలు పార్కులలో గడిపే ఆ సమయాన్ని ఆనందకరంగా గడిపేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత పార్క్ సూపర్వైజర్ దేనని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, పార్క్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.