-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. భుజాన ఎత్తుకున్న జెండాను దింపకుండా పాటుపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 29వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకునేలా జగనన్న ఐదేళ్ల పరిపాలన కొనసాగించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యంగా డివిజన్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టామని.. ఆర్.యు.బి. నిర్మాణంతో ప్రజల దశాబ్దాల కల నెరవేర్చామన్నారు. రూ.1.15 కోట్లతో కొబ్బరితోట నుంచి శివాలయం వంతెన వరకు సీసీ రహదారి, ఇందిరాకాలనీ రామాలయం రోడ్డు, తోట కేదారేశ్వరరావు వీధి రోడ్డు, ముదిరాజ్ కళ్యాణమండపం రోడ్డు, నేతాజీ రోడ్డు, ములక్కాయల వీధి, కొబ్బరితోటలలో రోడ్లు వేసినట్లు చెప్పారు. రూ. 15.35 లక్షలతో నూతన శానిటరీ కార్యాలయం, రూ. 42 లక్షలతో వంగవీటి మోహనరంగా కర్మల భవన్, లెక్చరర్స్ కాలనీలో రూ. 17 లక్షలతో ఓపెన్ జిమ్, పార్కు ప్రారంభించుకున్నట్లు చెప్పారు. అలాగే వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో బావి రోడ్డు, తుంగం కోటేశ్వరరావు రోడ్డు, హనుమంతరావు రోడ్డులోని ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంలో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మల్లాది విష్ణు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కేవలం 5 నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కూటమి నేతలు అసత్య ఆరోపణలు, దాడులే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని.. వారికి ఎదురొడ్డి పోరాడేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి.. ప్రజల పక్షాన పోరాడదామన్నారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. సమావేశంలో నాయకులు కంభం కొండలరావు, ఎస్.కె.బాబు, అక్బర్, యరగొర్ల శ్రీరాములు, జాక్సన్, దాసం రామరాజు, జి.వాసు, సన్యాసి రాజు, జయలక్ష్మి, దేవినేని సుధాకర్, నాగు తదితరులు పాల్గొన్నారు.