అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీవో నూతన నాయకత్వం ఏపీ ఎన్జీవో నేతలు బుధవారం ముఖ్యమంత్రి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో విజన్ ఉన్న సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఇస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని ఆశలను నింపిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలతో పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదమే విరమణ 62 సంవత్సరాలుగా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పిఆర్సి కమిషన్ ను త్వరగా నియమించాలని సీఎం చంద్రబాబు కు విజ్ఞప్తి చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 2004 సెప్టెంబరు ఒకటికి ముందు నోటిఫికేషన్ లో ఎంపికైన ఉద్యోగు లందరికీ పాత పెన్షన్ విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు ఏపీ జెఎసి, ఏపీ ఎన్జీవో నేతలు.
సీఎం ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, రాష్ట్ర ఏపీ జేఏసీ సెక్రెటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్, యుటిఎఫ్ ఏపీటీఎఫ్ తో పాటు పలు సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.