నందిగామలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి: దేవినేని ఉమా

-శాఖమూరి వంశీధర్‌, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం
-నందిగామ అభివృద్ధికి రూ.154 కోట్లతో పనులు – త్వరలో కృష్ణా జలాలు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త:
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో జనసేన, బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శాఖమూరి వంశీధర్‌తో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నందిగామ పట్టణంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చైర్మన్ అభ్యర్థి వంశీధర్‌తో పాటు 11, 12, 13, 14వ వార్డుల కూటమి అభ్యర్థులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాయకత్వంలో నందిగామలో రూ.154 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపుబ్బరం తో వసూల్ బ్రదర్స్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో వాళ్ళు నందిగామను బ్రష్టు పట్టించారని విమర్శించారు. నందిగామలో దేవినేని వెంకటరమణ వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, రూ.103 కోట్లతో రక్షిత మంచినీటి పథకం పనులు చేపట్టామని తెలిపారు. త్వరలో నందిగామ ప్రజలకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు రామ్ మాధవ్ పర్యవేక్షణలో సమర్థులైన కూటమి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీధర్‌తో పాటు మొత్తం 31 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తోందని, శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేశామని తెలిపారు. మిగిలిన హామీలను కూడా నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ‘చెప్పాం – చేస్తున్నాం’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు