చెప్పాం… చేస్తున్నాం… ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెడుతున్నాం: దేవినేని ఉమా

-నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా, బూరుగుపల్లి శేషారావు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త:
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. నిడదవోలు మున్సిపాలిటీలోని 31వ వార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ కందుల దుర్గేష్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, మంత్రి శ్రీ నారా లోకేశ్ సహకారంతో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నాయకులు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడం, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల్లో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సమర్థవంతమైన స్థానిక నాయకత్వం కూడా ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి బలపడాలని నాయకులు అభిప్రాయపడ్డారు.
31వ వార్డులో ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్న నాయకులు, వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.