రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

-రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులకు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు, జోనల్, రూట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం విశ్వవిద్యాలయంలో రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహించాల్సిన విధులపై అధికారులకు ఆయన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీన పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఒకే రూట్‌కు చెందిన సిబ్బంది ఒకేసారి రావడం వల్ల రద్దీ ఏర్పడకుండా, ఒక్కో బస్సులోని వివిధ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని నిర్దేశించిన స్టాళ్లకు క్రమబద్ధంగా పంపిణీ చేయాలని సూచించారు. రద్దీ పెరిగిన సందర్భాల్లో సిబ్బంది ఆందోళనకు గురికాకుండా, సంబంధిత అధికారులు కేటాయించిన టేబుళ్ల వద్దే ఉండి క్రమపద్ధతిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఈసీ బ్లాక్, సివిల్ మెకానికల్ బ్లాక్, సెంట్రల్ బ్లాక్, ఆర్కిటెక్చర్ బ్లాక్‌లలో మొత్తం 26 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి స్టాల్ వద్ద రెండు టేబుళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మొదటి టేబుల్ వద్ద బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, గ్రీన్ సీల్ అకౌంట్, ప్రిసైడింగ్ అధికారి డైరీ తదితర కీలక ఎన్నికల సామగ్రిని సంబంధిత సిబ్బంది నుంచి వ్యక్తిగతంగా స్వీకరించి, జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. రెండో టేబుల్ వద్ద స్టాట్యుటరీ, నాన్-స్టాట్యుటరీ సామగ్రిని స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద నలుగురు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించిన స్టాళ్ల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. డ్రాపింగ్ పాయింట్లు, స్టాళ్ల స్థానాలపై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలని, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, చేపట్టిన ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, జి.రవీంద్ర, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ డి.రాంబాబు, ఎస్‌ఈ జి.వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ డాక్టర్ సురేష్, డీసీపీ సూరజ్ కుమార్, బయాలజిస్ట్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.