మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బందికి గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జనరల్, ఎన్నికల నోడల్ అధికారి ఎ. రవీంద్రరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఎన్నికల సిబ్బంది శిక్షణ నోడల్ అధికారి డాక్టర్ డి. హరీష్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. మాస్టర్ ట్రైనర్ హుస్సేన్ ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ అంశాలపై సిబ్బందికి వివరంగా శిక్షణ అందించారు.

ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మి, ఐఏఎస్, పరిశీలించి శిక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అవగాహన కల్పించేందుకు చేపట్టిన శిక్షణ కార్యక్రమం వివరాలను తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, నిబంధనల అమలు, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ కీలకమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించడం, ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించడం, ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను అప్రమత్తంగా గమనిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు మైక్రో అబ్జర్వర్లు కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకుంటూ, తమకు అప్పగించిన బాధ్యతలను స్పష్టమైన అవగాహనతో నిర్వహించాలని శిక్షణలో సూచించారు.

అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల సామగ్రి నిర్వహణ, కౌంటింగ్ సమయంలో అప్రమత్తత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రమశిక్షణ, ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను నిర్వహించాలని వివరించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను ముందుగానే పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవడం ద్వారా ఎన్నికల నిర్వహణలో సమన్వయాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.

రెండవ సాధారణ ఎన్నికలు–2026ను సజావుగా నిర్వహించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ, సమన్వయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. శిక్షణ ద్వారా సిబ్బందిలో విధుల పట్ల స్పష్టతను పెంపొందించి, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నద్ధతను కల్పిస్తున్నారు.