విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల పరిశీలకులు యస్. నాగలక్ష్మి ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం చేపట్టిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, వారికి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బందిలో విజయవాడ నగరంలో ఓటు హక్కు కలిగిన అర్హులైన వారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 30, 2026 పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు చివరి తేదీ కావడంతో, ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోని అర్హులైన ఎన్నికల సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే సిబ్బందికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, మేయర్ రిటర్నింగ్ అధికారి, పీడీ హౌసింగ్ రజిని కుమారి, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
