రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం నిలిపివేయాలి – కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 1, 2026 (ఆదివారం) ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో, పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మేయర్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి మద్దతుదారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్ 600 ప్రకారం, పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభలు, ఊరేగింపులు, చట్టం నిషేధించిన ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు.

కావున, రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా నిషేధిత ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిలిపివేసి, ఎన్నికల నియమావళిని పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.