తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి…

-నీటి నమూనాల పరీక్షను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావం తొల‌గిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తుపాను అనంతర పారిశుధ్య చర్యలు, సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. తుపాను అనంతరం గ్రామాల్లో తాగునీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తిరువూరు మండ‌లం, ల‌క్ష్మీపురం గ్రామంలో ప‌ర్య‌టించారు. స్థానిక వాట‌ర్ ట్యాంకు వ‌ద్ద నీటి న‌మూనాల ప‌రీక్ష‌ల విధివిధానాల‌ను ప‌రిశీలించారు. తాగునీటి నమూనాల పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, నీటి నాణ్యతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనే అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతకు ప్రజల ఆరోగ్యానికి విడదీయలేని సంబంధం ఉందని, కలుషిత నీటి వినియోగం వల్ల విరేచనాలు, ఇతర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తుపాను అనంతరం వర్షపు నీరు, మురుగునీరు తాగునీటి వనరుల్లో కలిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి సరఫరా వ్యవస్థలోని ట్యాంకులు, పైపులైన్లు, ఇతర వనరులను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతోపాటు, అవసరమైన చోట్ల నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, అవసరమైన చోట్ల నిబంధనల ప్రకారం క్లోరినేషన్ చేపట్టడం, నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ వెంట తిరువూరు ఆర్‌డీవో ఎ.కుమార్‌, స్థానిక అధికారులు ఉన్నారు.