ఎన్నికల ప్రచార వ్యయం, అనుమతులు, అకౌంట్ల నిర్వహణపై అభ్యర్థులకు అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, విఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులు, మేయర్ అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఎన్నికల ప్రచార వ్యయం, అకౌంట్ల నిర్వహణ, అనుమతులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలపై ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చుల వివరాలను విజయవాడ నగరపాలక సంస్థకు ఏ విధంగా సమర్పించాలి, ప్రచార కార్యక్రమాలకు అవసరమైన అనుమతులను ఎలా పొందాలి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎలా పాటించాలి, నియమావళికి విరుద్ధంగా ఉండే చర్యలకు దూరంగా ఎలా వ్యవహరించాలి అనే అంశాలను వివరించారు. ప్రచార కార్యక్రమాల్లో వినియోగించే వాహనాలు, మైకులు, ఇతర పరికరాలు, ప్రచార సామగ్రి తదితర అంశాలకు సంబంధించిన ఖర్చులను నిర్దేశిత రేట్ల ప్రకారం లెక్కించి, వాటి వివరాలను ఎన్నికల వ్యయ ఖాతాల్లో నమోదు చేయాలని సూచించారు.

ఎన్నికల వ్యయ పరిమితులను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సంబంధించి రూ.10 లక్షలకు మించకుండా, మేయర్ అభ్యర్థులు రూ.25 లక్షలకు మించకుండా వ్యయం చేయాలని తెలిపారు. ప్రచారానికి సంబంధించిన ప్రతి ఖర్చుకు తగిన వివరాలను నమోదు చేసి, సంబంధిత అకౌంట్లను నిబంధనల ప్రకారం నిర్వహించాలని వివరించారు.

ఎన్నికల ప్రచార కార్యకలాపాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, వీడియో సర్వైలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ప్రచారానికి సంబంధించిన అనుమతులు, ఖర్చుల వివరాలు తదితర అంశాలను సంబంధిత బృందాలు పరిశీలిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎన్నికల వ్యయ వివరాలను పారదర్శకంగా నమోదు చేసి సమర్పించాలని అభ్యర్థులు, వారి ఏజెంట్లకు అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు.