-వైద్యుల నిరంతర శిక్షణ, పరిశోధనల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మెడికల్ అకాడమీ ఏర్పాటు చేయాలి
-డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ లోని డా. బి ఆర్. అంబేద్కర్ కళా వేదికలో సోమవారం డా.ఎన్.టి.ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 40 సంవత్సరాల రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేస్తూ .. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు దూరదృష్టితో 1986లో దేశంలోనే మొట్టమొదటి హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. గత 40 ఏళ్లుగా వైద్య విద్యారంగంలో విశ్వవిద్యాలయం విశేష ప్రగతిని సాధించిందని, అల్లోపతి, డెంటల్, ఆయుష్, నర్సింగ్, ఫార్మసీ విభాగాల్లో లక్షలాది మంది నిపుణులను తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
వైద్య పరిశోధనలకు రూ.13 కోట్ల కేటాయింపు
వైద్యరంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం ఇప్పటికే సుమారు రూ.13 కోట్ల నిధులను కేటాయించిందని వీసీ తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. గైనకాలజీ ఎండోస్కోపీ, లాపరోస్కోపిక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, రిప్రొడక్టివ్ మెడిసిన్, ఫీటల్ మెడిసిన్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ వంటి ప్రత్యేక విభాగాల్లో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులను ప్రారంభించినట్లు వివరించారు.
అదేవిధంగా రీసెర్చ్ మెథడాలజీ, బయోస్టాటిస్టిక్స్, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ తదితర అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. వైద్య విద్య, పరిశోధనల్లో సరికొత్త అవకాశాలకు మార్గం సుగమం చేసేలా త్వరలోనే వినూత్నమైన ‘క్వాంటం బయాలజీ’ కోర్సును కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఏఐ, డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా వైద్య విద్య
భవిష్యత్తులో వైద్య విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, సిమ్యులేషన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో మరింతగా ముడిపడి ఉంటుందని వీసీ పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిస్తూ, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రత్యేక ‘మెడికల్ అకాడమీ’ ఏర్పాటు చేయాలి
ఆంధ్రప్రదేశ్లో వైద్యుల నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వైద్య పరిశోధనలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా ‘మెడికల్ అకాడమీ’ని ఏర్పాటు చేయాలని వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఐఏఎస్ అధికారులకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), న్యాయాధికారులకు భోపాల్లోని జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లుగానే, రాష్ట్ర వైద్యులకు నిరంతర శిక్షణ, ఆధునిక వైద్య పరిజ్ఞానం, పరిశోధనల కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.
హైకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ దుర్గాప్రసాద్ ఆలోచన మేరకు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు చేసి, ప్రత్యేక అధ్యాయం ద్వారా మెడికల్ అకాడమీని చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అకాడమీ ఏర్పాటుతో వైద్యుల వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు, నిరంతర వైద్య విద్య, పరిశోధనల అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు డైరెక్టర్ డా. ఎం.కె. రమేష్ మాట్లాడుతూ…
వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో, ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటూనే మానవీయ విలువలు, సానుభూతి, నైతిక ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ స్థాయి వైద్యులను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో దేశానికి ఎంతోమంది ప్రతిభావంతులైన వైద్యులను అందించిందని ఆయన ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటి హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిన ఈ సంస్థ వైద్య విద్యారంగంలో విశిష్ట గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి ఉన్నత విద్యాసంస్థలు బహుళ విభాగాల సమ్మేళనంతో కూడిన మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయాలుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని డా. రమేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆరోగ్య విశ్వ విద్యాలయాలు తమ లక్ష్యాలు, విద్యా విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. వైద్య విద్యను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా బోధనా విధానాలు, పరిశోధనా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య చికిత్సల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో పాటు, చికిత్స కోసం రోగులు దీర్ఘకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని డా. రమేష్ వివరించారు. దీనికి భిన్నంగా భారతదేశంలో నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం దేశానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
అత్యుత్తమ వైద్య నైపుణ్యాలు, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం, అందుబాటు ధరల్లో చికిత్స అందించే సామర్థ్యం కారణంగా భారత్ అంతర్జాతీయ హెల్త్ టూరిజం కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. విదేశీ రోగులు భారతదేశంలో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను విస్తృతంగా నిర్వహించి అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను పెంపొందించాలని డా. రమేష్ సూచించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే పరిశోధనా దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధునిక సాంకేతికత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ, వైద్యుడు–రోగి మధ్య ఉండే అనుబంధం, పరస్పర విశ్వాసం, సానుభూతి, నైతిక విలువలు ఎప్పటికీ కీలకమేనని స్పష్టం చేశారు. టెక్నాలజీని మానవీయ దృక్పథంతో సమన్వయం చేస్తూ, మారుతున్న వైద్య రంగ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) యుజిఎంఈబి/బోర్డు ప్రతినిధి
డా. ఎం.కె. రమేష్, విశ్వ విద్యాలయ మాజీ ఉపకులపతులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మాజీ రిజిస్ట్రార్లు, ప్రముఖ వైద్య నిపుణులు, అధ్యాపకులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తొలుత సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ లు గౌరవ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కు డా. బి.ఆర్ అంబేద్కర్ కళావేదిక వద్ద ఘనంగా స్వాగతం పలికారు.
