-ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు
-వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల ప్రాంతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించారు.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లుతున్న కాలువలు, వాగులను దాటేందుకు ప్రయత్నించరాదని, నదుల్లో ఈతకు వెళ్లకూడదని హెచ్చరించారు.
నాలుగు రోజుల వర్ష సూచన
శుక్రవారం (అక్టోబర్ 30): అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శనివారం (అక్టోబర్ 31): విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఆదివారం (నవంబర్ 1): కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు.
సోమవారం (నవంబర్ 2): పోలవరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
పలాసలో అత్యధికంగా 40.7 మి.మీ. వర్షపాతం
గురువారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో 40.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. కంచిలిలో 27 మి.మీ., మందసలో 24.5 మి.మీ., ఇచ్ఛాపురంలో 23.7 మి.మీ., పిన్నింటిపేటలో 17 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహించే మార్గాలు, వాగులు, కాలువలు దాటే సాహసం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
