-రైల్వే, అటవీ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ సమావేశానికి ఆదేశం
-అటవీ మార్గ ప్రయాణాల్లో లోకో పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రైలు ఢీకొన్న ప్రమాదంలో రెండు ఎలుగుబంటి పిల్లలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం కళ్యం గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. కళ్యాణదుర్గం అటవీ రేంజ్‌లోని, రాయదుర్గం బీట్, సెక్షన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై అటవీ శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల మధ్య వెళ్లే రైల్వే మార్గాల్లో వన్యప్రాణులు ప్రమాదాల బారినపడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అటవీ, రైల్వే శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
గతంలో అదే మార్గంలో రైలు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, అటవీ మార్గాల్లో రైళ్లు నడిపే లోకో పైలెట్లు వన్యప్రాణి సంరక్షణ చర్యల్లో భాగంగా రూపొందించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై స్థానిక రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అటవీ శాఖ అధికారులు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల సమయంలో వన్యప్రాణుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని నిర్దేశం చేశారు.
అటవీ ప్రాంతాల గుండా రైళ్లు ప్రయాణించే సమయంలో లోకో పైలెట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారం ఉండే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను నిశితంగా గమనిస్తూ రైళ్లను నడపాలని, అటవీ మార్గాల్లో రైళ్ల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా హారన్ మోగించడం వంటి చర్యల ద్వారా వన్యప్రాణులకు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అలాగే ఈ మార్గాల్లో రైళ్లను నడిపే లోకో పైలెట్లకు రైల్వే శాఖ వన్యప్రాణుల సంచారం, వాటి సంరక్షణ, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు స్థానిక రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ వన్యప్రాణులు రైల్వే ట్రాక్‌లను దాటే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దృష్టి సారించాలన్నారు. రైల్వే మార్గాల్లో వన్యప్రాణులకు జరుగుతున్న ప్రమాదాలను నివారించే అంశాన్ని సంబంధిత రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని పీసీసీఎఫ్ ని ఆదేశించారు.
విద్యుద్ఘాతంతో ఏనుగుల వరుస మరణాలపై…
విద్యుద్ఘాతం కారణంగా వరుసగా సంభవిస్తున్న ఏనుగుల మరణాలపై ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న జిల్లాల్లో సంబంధిత కలెక్టర్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, నివారణ చర్యలపై చర్చించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ షాక్ కారణంగా సంభవిస్తున్న ఏనుగుల మరణాల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని స్పష్టం చేశారు. ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అటవీ ఉన్నతాధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తగినంత ఎత్తులో ఉండేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో పంటల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
