తుపాను సహాయక, పునరుద్ధరణ పనులపై సీఎం సమీక్ష

-విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన, ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయక, పునరుద్ధరణ చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ఈ సమీక్షలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, విద్యుత్, రహదారులు, టెలికమ్యూనికేషన్ సేవల పునరుద్ధరణ, వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై చర్చించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్ సిబ్బందిని రప్పించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి ఇంటిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, నిర్ణీత గడువులోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కృషిని అభినందించిన ముఖ్యమంత్రి, చివరి బాధితుడికి కూడా సహాయం అందే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. మొబైల్ నెట్‌వర్క్ సేవల పునరుద్ధరణ ఆశించిన వేగంతో సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టెలికమ్యూనికేషన్ సంస్థలు మరింత బాధ్యతతో వ్యవహరించి సేవలను త్వరగా పునరుద్ధరించాలని కోరారు.
4,771 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన 5,400 గ్రామాల్లో 4,771 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మరో 629 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కృష్ణా జిల్లాలో ప్రభావితమైన 915 గ్రామాలకు గాను 835 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా, మరో 80 గ్రామాల్లో పనులు మిగిలి ఉన్నాయి.
2,396 కిలోమీటర్ల రహదారులకు నష్టం

రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు కలిపి మొత్తం 2,396 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 552 కిలోమీటర్లు, కోనసీమలో 396 కిలోమీటర్లు, తూర్పు గోదావరిలో 372 కిలోమీటర్లు, శ్రీకాకుళంలో 309 కిలోమీటర్లు, అనకాపల్లిలో 236 కిలోమీటర్లు, విజయనగరంలో 211 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తం 62 రోడ్డు గండ్లలో 22, 34 కరకట్ట గండ్లలో 13 మరమ్మతులు పూర్తి చేశారు. ఇంకా 40 రోడ్డు గండ్లు, 21 కరకట్ట గండ్ల వద్ద పనులు చేపట్టాల్సి ఉంది. దెబ్బతిన్న 102 కల్వర్టులు, ఇతర క్రాస్ డ్రైనేజీ నిర్మాణాల్లో 83 పునరుద్ధరించగా, మరో 19 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

రోడ్లపై పడిపోయిన 2,264 చెట్లను పూర్తిగా తొలగించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే 183 చెట్లను తొలగించగా, వీటిలో కాకినాడ జిల్లాలో 127, తూర్పు గోదావరి జిల్లాలో 56 చెట్లు ఉన్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన 133 ప్రాంతాల్లో 99 చోట్ల రవాణాను పునరుద్ధరించగా, మరో 34 ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.
3.33 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం

ప్రాథమిక అంచనాల ప్రకారం, తుపాను ప్రభావంతో 16 జిల్లాల్లో 3,33,268 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం తుది అంచనాలు ఇంకా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా పశ్చిమ గోదావరిలో 76,752 హెక్టార్లు, కాకినాడలో 52,253 హెక్టార్లు, తూర్పు గోదావరిలో 49,959 హెక్టార్లు, కోనసీమలో 46,845 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 44,836 హెక్టార్లలో పంటలు ప్రభావితమయ్యాయి.

ప్రస్తుతం అనేక పంటలు పూత, కాయ ఏర్పడే కీలక దశల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. వ్యవసాయ భూముల్లో నిల్వ ఉన్న నీరు క్రమంగా తగ్గుతుండటంతో నీట మునిగిన పంటలు బయటపడుతున్నాయని, దీంతో నష్టాన్ని మరింత స్పష్టంగా అంచనా వేయడానికి వీలవుతోందని తెలిపారు.
22,452 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

అర్నబ్ తుపాను ప్రభావంతో 15 జిల్లాల్లో 22,452 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కోనసీమ జిల్లాలో అత్యధికంగా 11,229 హెక్టార్లు, తూర్పు గోదావరిలో 4,423 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం ఉద్యాన పంటల ప్రభావిత విస్తీర్ణంలో దాదాపు సగం కోనసీమ జిల్లాలోనే ఉంది.

ఇతర జిల్లాల్లో కృష్ణాలో 1,350 హెక్టార్లు, బాపట్లలో 1,182 హెక్టార్లు, కాకినాడలో 1,048 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 903 హెక్టార్లు, ఏలూరులో 415 హెక్టార్లు, గుంటూరులో 415 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
380 టీఎంసీల నీటి రాక

అక్టోబర్ 26 నుంచి 29 వరకు కురిసిన వర్షాల వల్ల రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు చేరినట్లు అంచనా వేశారు. భూగర్భ జలాల మట్టాలు సుమారు 44 టీఎంసీల మేర పెరిగినట్లు సమీక్షలో వెల్లడించారు. జలవనరులకు జరిగిన నష్టం, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలపైనా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు విద్యుత్, రవాణా, టెలికమ్యూనికేషన్ సహా అత్యవసర సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, తుపాను బాధితులకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.