-సాధారణ స్థితికి తెచ్చేందుకే నిరంతరం శ్రమిస్తున్నాం
-పంటల భీమాతోనే ప్రతిరైతుకూ ధీమా
-డెల్టా కాలువల ఆధునీకరణతో ముంపు తొలగిస్తాం
-తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
-షెల్టర్లలోని బాధితులకు బియ్యం, సరుకులు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి
నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులు, నష్టాలకు గురైన కొబ్బరి రైతులు, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా రెండో రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి, రైతులు, మత్స్యకారులు, స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నరసాపురం మండలం కొత్త నవరసపురంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడారు. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. ఇ-పంట విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగినప్పుడు బీమా ద్వారా పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటకు నష్టం వాటిల్లకుండా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పంట కాలువల్లో నీటి ప్రవాహం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని, పనులు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని సూచించారు. దీనివల్ల పంటలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
15 వేల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి
తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేల కూలాయని సీఎం తెలిపారు. రేపు సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ప్రకటించారు. తొలుత గృహాలకు, ఆ తర్వాత వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని తెలంగాణ నుంచి కూడా రప్పిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.. కార్మికులతో కలిసి విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టేందుకు సీఎం సహకరించారు. విపత్కర పరిస్థితుల్లో నూ శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది, కార్మికులను ముఖ్యమంత్రి అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే 12,500 చెట్లు నేల కూలాయని, వాటి వ్యర్థాలను త్వరితగతిన తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తుఫాను గాలుల కారణంగా కొబ్బరి చెట్లు, వరి పంటలు దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలోనూ కొంత అంతరాయం ఏర్పడిందని, ప్రైవేటు టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిగ్నల్స్ సమస్య తలెత్తిందని తెలిపారు. వీటిని కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
తుఫాను షెల్టర్లలో బాధితులకు భరోసా
మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నాలుగు రోజులుగా అక్కడ ఆశ్రయం పొందుతున్న మహిళలు, ఇతర బాధితులతో మాట్లాడారు. తుఫాను తీరం దాటే సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యామని వారు సీఎంకు వివరించారు. తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అందువల్ల ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించ గలిగామని సీఎం తెలిపారు. వశిష్ట గోదావరిలో ఎదురవుతున్న సమస్యలను మత్స్యకారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సముద్ర ముఖద్వారం వద్ద కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించి, మత్స్యకారులు సులభంగా చేపల వేట సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది
మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్ సందర్శన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అర్నబ్ తుఫాను ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించానన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. రాత్రంతా సమీక్షలు నిర్వహిస్తూ వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని వివరించారు. కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేశామని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, దురదృష్టవశాత్తూ ఏడుగురు మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. తుఫాను వల్ల ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపించామని, పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి మరో నివేదిక అందిస్తామని తెలిపారు. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తోందని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని, ప్రజల భాగస్వామ్యంతో విపత్తును సమర్థంగా ఎదుర్కొన గలిగామని సీఎం అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువులను నింపేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు అందిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా రెండో విడతగా రూ.7 వేల చొప్పున రైతులకు జమ చేశామన్నారు. తుఫాను కారణంగా పంటలు నీట మునిగిన రైతులను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తుఫాను బాధిత కుటుంబాలకు బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, బంగాళదుంపలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో భాగంగా బాధితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన రేషన్ అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ తుఫాను బాధితుల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తుఫాను బాధితులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేశారు. సీఎం వెంట మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
