-‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వచ్చినప్పుడు మా కష్టాన్ని మీ కష్టంగా భావించారు
-నాడు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
-సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం ఇచ్చిన నారా భువనేశ్వరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో ప్రజలు, మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందించిన మద్దతు, చూపిన అభిమానం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయని నారా భువనేశ్వరి తెలిపారు. నాటి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె సామాజిక మాధ్యమ వేదికగా భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు.
చంద్రబాబు నాయుడు నిర్బంధంలో ఉన్న 53 రోజుల కాలాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ సమయంలో ప్రజలు తమ కుటుంబానికి అందించిన అండ జీవితాంతం మరువలేనిదని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున చంద్రబాబు నాయుడు నిర్బంధం నుంచి విడుదలై తిరిగి ప్రజల్లోకి వచ్చారని గుర్తుచేశారు.
రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండే తాను చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల వద్దకు వచ్చినప్పుడు, తన కష్టాన్ని ప్రజలు తమ కష్టంగా భావించారని భువనేశ్వరి తెలిపారు. పల్లెల్లోని మహిళల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల వరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంఘీభావం ప్రకటించడం తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు.
గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన యువత, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు చూపిన అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు ప్రజల కోసం దశాబ్దాలుగా చేసిన కృషికి ప్రజలు అందించిన ఆదరణకు ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా నాటి పరిస్థితుల్లో మహిళలు, ఆడబిడ్డలు చూపిన ధైర్యం, రోడ్లపైకి వచ్చి తమ గళాన్ని వినిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఆ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజల ఆత్మీయత, మద్దతు, నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటామని నారా భువనేశ్వరి తన సందేశంలో మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
