-కోట్లాది హృదయాల స్పందన నా జీవితానికి గొప్ప బలం
-కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
-ప్రజా మద్దతును గుర్తుచేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
53 రోజుల నిర్బంధ సమయంలో కోట్లాది మంది తెలుగు ప్రజలు తనకు అందించిన మద్దతు, చూపిన అభిమానం జీవితాంతం మరువలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాడు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున 53 రోజుల నిర్బంధం అనంతరం రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజల్లోకి వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని పేర్కొన్నారు.
నంద్యాలలో అర్ధరాత్రి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని, అది కుట్రపూరిత అరెస్టు అని ప్రజలకు అర్థమైందని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తిరిగి ప్రజల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
తనను నిర్బంధించి ఒంటరిని చేయాలనుకున్న ప్రయత్నాలు యావత్ తెలుగు ప్రజల స్పందనతో విఫలమయ్యాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు.
సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమం మరువలేని అనుభూతి
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ రంగాల నిపుణుల సంఘీభావం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
తాను తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాల ద్వారా మంచి ఉద్యోగాలు పొందిన వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మద్దతు ప్రకటించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు, విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు, సామాన్య మహిళల నుంచి ప్రముఖ సంస్థల ఉన్నతాధికారుల వరకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు.
నిజం గెలవాలి కార్యక్రమానికి ప్రజల సంఘీభావం
రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే తన సతీమణి, కుటుంబ సభ్యులు ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారితో కలిసి అడుగులు వేసి సంఘీభావం తెలిపారని, నిజం, ధర్మం పక్షాన నిలిచారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి, తమ నిరసనను తెలియజేయడం మరువలేని అనుభూతిగా అభివర్ణించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
తనకు మద్దతు తెలిపిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
నాడు తన కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని, తన కోసం నిలిచిన ప్రజల కోసం చివరి వరకు నిలబడతానని పేర్కొన్నారు.
2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడతా
ప్రజల నమ్మకం, అభిమానం తనకు బలమని, వారి భవిష్యత్తే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతానని తన సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించారు.
