-జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘన నివాళులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వగురు బసవేశ్వరుడు కులవివక్ష నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురు బసవేశ్వరుడు జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన చిత్రపటానికి డీఆర్ఓ కె చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి సమాజంలో నెలకొన్న కులవ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షతలను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది అని పేర్కొన్నారు. కర్ణాటకలోని బాగేవాడిలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే శైవ తత్వాన్ని అవగతం చేసుకుని, కర్మకాండలు, వైదిక ఆచారాలపై విమర్శనాత్మక దృక్పథాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు.
లింగాయత ధర్మ స్థాపకుడిగా బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, మానవతా విలువలు, శ్రమకు గౌరవం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేశారని, ఆయన రచించిన వచన సాహిత్యం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందని అన్నారు. ఆయన స్థాపించిన అనుభవ మండపం అన్ని వర్గాల ప్రజలకు తమ అభిప్రాయాలు వ్యక్తపరచుకునే వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. వర్ణాంతర వివాహాలకు ప్రోత్సాహం ఇచ్చి సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడైన బసవేశ్వరుని బోధనలు నేటికీ సమాజానికి ఆదర్శప్రాయమని డీఆర్ఓ తెలిపారు. సమానత్వం, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, అవనిగడ్డ డిఎస్పి ఆర్ అభిషేక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, కలెక్టరేట్ ఏవో రాధిక, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News