వాహన యాజమాన్య బదిలీ సేవల్లో దేశంలోనే ఏపీకి ప్రథమ స్థానం

-సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ రవాణా శాఖ పనితీరుకు జాతీయ గుర్తింపు.
-EVOI–2026లో ఏపీ అగ్రస్థానం పై రవాణా అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్‌షిప్ ఇండెక్స్ (EVOI)-2026లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని 15 రాష్ట్రాల్లో ప్రథమ స్థానాన్ని సాధించడంపై రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఈ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణమని సచివాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నవంబర్ 4న ఇండియాటెక్.ఆర్గ్, కన్స్యూమర్ వాయిస్ సంయుక్తంగా విడుదల చేసిన ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రంలో రవాణా శాఖ చేపడుతున్న సంస్కరణలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని మంత్రి తెలిపారు.

వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, బయోమెట్రిక్ ప్రీ-ఆథెంటికేషన్ విధానం ద్వారా పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను విస్తరించడం వంటి చర్యలు రాష్ట్రానికి ఈ గుర్తింపు తీసుకువచ్చాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాకేంద్రీకృత పాలనకు ప్రాధాన్యత ఇస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన రవాణా శాఖ అధికారులకు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యతను పెంచుతూ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.