స్టెల్లా కళాశాలలో ఈ-వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం

-ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలి: డా. పి. కృష్ణయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణ పరిరక్షణ బోర్డు చైర్మన్ డా. పి. కృష్ణయ్య అన్నారు. విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. పి. కృష్ణయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల గాలి, నేల, నీరు కలుషితమై మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని వివరించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు అవసరమైన మేరకే పరికరాలను వినియోగించడం, పాడైన పరికరాలను మరమ్మతులు చేయించుకోవడం, సాధ్యమైనంత వరకు పునర్వినియోగించుకోవడం అనే మూడు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

మహమ్మద్ ఫాతిమా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను, ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. సోషల్ సైన్స్ విభాగాధిపతి విద్యార్థులకు ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కళాశాల డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఎస్. ఆశా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్. వాణిలత, వృక్షశాస్త్ర విభాగాధిపతి టి. కిరణ్మయి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.