-అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం.. 2029 నాటికి మరింత అభివృద్ధి సాధిస్తాం
-టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మరింత బలోపేతం అవుతుంది
-బీజేపీ శాసనసభా చీఫ్ విప్, ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జగన్ ఇజంలో నిజం లేదని, రాజకీయ మనుగడ కోసమే ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ శాసనసభా చీఫ్ విప్, ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి విమర్శించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విడిపోవాలని వైసీపీ ఆశపడుతోందని, అయితే కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చి చూడలేమని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, స్థానిక సమస్యలు, నాయకుల మధ్య సమన్వయ లోపాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయని వివరించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే గుర్తించి సరిదిద్దుకుంటామని, రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం
జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులోనూ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పును గౌరవించకుండా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడటమే వైసీపీ రాజకీయ ధోరణిగా మారిందని విమర్శించారు. తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీనేనని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రవాణా, కమ్యూనికేషన్, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, కడప ప్రాంతాల్లో ఉక్కు, సిమెంట్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పుట్టపర్తిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నాయని వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తూ సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
పోలవరం, అమరావతి నిర్మాణం, గృహ నిర్మాణం, జలజీవన్ మిషన్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగాల అభివృద్ధికి నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
జమ్మలమడుగులో బీజేపీకి మంచి ఫలితాలు
జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ సాధించిన విజయాలు పార్టీ బలాన్ని తెలియజేస్తున్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 19 మంది కౌన్సిలర్లు విజయం సాధించడం, ఎంపీటీసీ స్థానాల్లోనూ మంచి ఫలితాలు రావడం పార్టీ కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో పులివెందుల ప్రాంతంలోనూ పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు.
కూటమి అభ్యర్థుల విజయానికి బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని, 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధికి బలమైన పునాది పడుతోందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
నిష్పక్షపాతంగా వార్తలు రాయాలి
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన, అధికార పక్షం తప్పు చేసినా, ప్రతిపక్షం తప్పు చేసినా నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని పాత్రికేయులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా చేయాల్సిన పనులను కూడా ప్రజల ముందుంచాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, రాష్ట్ర నాయకులు శశి భూషణ్ రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
