గుంటూరులో రోడ్ కారిడార్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

-ఇంజినీరింగ్ అధికారులకు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశం
-పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో రోడ్ కారిడార్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో నగర అభివృద్ధి పనుల పురోగతిపై ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏడీహెచ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధికి గీటురాయిగా నిలిచే రోడ్ కారిడార్లు, జంక్షన్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రతి పనికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించుకుని, ఆ గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి గుర్తించిన 12 ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి ఎక్కడైనా స్థల సమస్యలు ఎదురైతే డిప్యూటీ సిటీ ప్లానర్‌తో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

నగరంలో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు రోడ్ల మధ్య డివైడర్లలో అవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఇప్పటికే డివైడర్లలో ఉన్న మొక్కలను అందంగా తీర్చిదిద్దేలా క్రమం తప్పకుండా ట్రిమ్మింగ్ చేయాలని ఏడీహెచ్‌ను ఆదేశించారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్‌ను మొక్కలకు వినియోగించాలని సూచించారు. కొత్తగా చేపట్టే ప్లాంటేషన్ నిర్వహణ బాధ్యతను సంబంధిత కాంట్రాక్టర్లే రెండేళ్లపాటు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డీఈఈకి స్పష్టం చేశారు.

నగరంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, పరిశుభ్రతకు సమాన ప్రాధాన్యతనిస్తూ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, ఈఈ వేణుగోపాల్, డీఈఈ శ్రీనివాస్, ఏడీహెచ్ శాంతి తదితరులు పాల్గొన్నారు.