దీపావళి వేళ గ్రీన్ క్రాకర్స్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

-సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలి
-కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
-సంబంధిత శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
2026 దీపావళి పండుగ సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి పొందిన గ్రీన్ క్రాకర్స్ తయారీ, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ఏపీపీసీబీ సభ్య కార్యదర్శి పంపిన లేఖ ఆధారంగా పర్యావరణ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత, శబ్ద కాలుష్య స్థాయిలను ఏపీపీసీబీ పర్యవేక్షించింది. ఈ సందర్భంగా సేకరించిన గాలి నాణ్యత గణాంకాల విశ్లేషణలో విశాఖపట్నం నగరంలో దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించింది.

గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసిందని, సున్నితమైన ప్రాంతాల్లో ఉద్గారాల నియంత్రణ, గాలి నాణ్యత పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతానికి సంబంధించి జారీ చేసిన తాజా ఆదేశాల్లోనూ గ్రీన్ క్రాకర్స్ తయారీ, విక్రయాలపై నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, అనుమతి పొందిన గ్రీన్ క్రాకర్స్ వినియోగానికే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ నిబంధనల అమలును రాష్ట్రంలోనూ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశించారు.

వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
దీపావళి పండుగతో పాటు శీతాకాలంలో విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో వాటి అమలును పర్యవేక్షించాలని సూచించింది.

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ క్రాకర్స్ వినియోగ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, వాయు కాలుష్యానికి కారణమయ్యే ఇతర వనరులను కూడా నియంత్రించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.