విజయసాయిరెడ్డి కొత్త పార్టీలోకి సుమతీరెడ్డి, బోనీ గణేష్

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
వేణుంబాక విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న నూతన రాజకీయ పార్టీలోకి తిరుపతికి చెందిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమతీరెడ్డి, హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోనీ గణేష్ చేరేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి వారిద్దరికీ శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, తన నూతన పార్టీలో అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని, యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. వైసీపీలో 70కి పైగా అవమానాలు ఎదుర్కొన్నానని, ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే పార్టీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను స్వచ్ఛందంగా వైసీపీ నుంచి బయటకు రాలేదని, అవమానించి బయటకు పంపించారని ఆరోపించారు.
సుమతీరెడ్డి మాట్లాడుతూ మహిళలకు అండగా నిలవడం, యువతలో మార్పు తీసుకురావడం, రైతుల సంక్షేమం కోసం పనిచేయడమే తన లక్ష్యమన్నారు. తిరుపతి జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. బోనీ గణేష్ మాట్లాడుతూ ఎస్సీ హిందువుల హక్కుల పరిరక్షణ కోసం విజయసాయిరెడ్డి కృషి చేస్తారనే నమ్మకంతో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరో ఐదు రోజుల్లో నూతన పార్టీని ప్రకటించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.