-ఆయుర్వేద వైద్యులకు ఘన సత్కారం.. విశిష్ట సేవలకు పురస్కారాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాయి సుధాకర్ ముఖ్య అతిథిగా, డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. ఆయుర్వేదిక్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుల్లయ్య గౌరవ అతిథిగా హాజరయ్యారు.
సభకు అధ్యక్షత వహించిన విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగం అధ్యక్షుడు డాక్టర్ నల్లు ధరణి కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున భగవాన్ ధన్వంతరి జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన, నమ్మకాన్ని పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన ఆయుర్వేద వైద్య విద్యార్థులను, విశిష్ట సేవలు అందించిన వైద్యులను గుర్తించి ప్రతి సంవత్సరం అవార్డులతో సత్కరిస్తున్నట్లు వివరించారు.
ముఖ్య అతిథి డాక్టర్ సాయి సుధాకర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుర్వేద వైద్య విధానం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గౌరవ అతిథి డాక్టర్ బుల్లయ్య మాట్లాడుతూ, విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
విశ్వ ఆయుర్వేద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాధవరావు చౌదరి మాట్లాడుతూ, ఆయుర్వేద రంగంలో బాధ్యతాయుతమైన సంస్థగా పరిషత్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ డాక్టర్ సాహితీ మాట్లాడుతూ, ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన, ఆదరణ పెంపొందించేందుకు ఇటువంటి వేడుకలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్య రంగంలో అత్యున్నత సేవలు అందించిన డాక్టర్ నిష్ఠేశ్వర్, డాక్టర్ హిమసాగర చంద్రమూర్తి, డాక్టర్ సీమా కుమారి, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి, డాక్టర్ సిరివెళ్ల మురళీధర్, డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ బాదం రమేష్, డాక్టర్ కోటేశ్వరరావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ కొండా వెంకటేశ్వరరావు, డాక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
