మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి

-పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ సంబంధిత అధికారులను ఆదేశించారు.

నందిగామ మున్సిపల్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత నందిగామ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లను పరిశీలించిన కలెక్టర్, ఓటర్లు తమ పోలింగ్ బూత్‌లను సులభంగా గుర్తించేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం నందిగామ కె.వి.ఆర్. కళాశాలలో సిద్ధం చేస్తున్న స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, స్ట్రాంగ్ రూముల్లోని కిటికీలను చెక్కలతో కాకుండా పూర్తిగా ఇటుకలతో మూసివేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రజలకు, సిబ్బందికి వేర్వేరు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన సూచిక బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు నియమావళిపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో జి.అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, నందిగామ, చందర్లపాడు ఎంపీడీవోలు, నందిగామ రూరల్ సీఐ, సర్వే శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.