తిరుపతి డీజీపీ–ఐజీపీ సదస్సులో యోగాకు ప్రత్యేక ప్రాధాన్యం

-ప్రధాని మోదీ యోగా ప్రోత్సాహానికి అనుగుణంగా మూడు రోజుల ప్రత్యేక సాధన
-పోలీసు ఉన్నతాధికారుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు
-కామన్ యోగా ప్రొటోకాల్‌ ప్రకారం 45 నిమిషాల పాటు సాధన
-మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతిలో జరగనున్న అఖిల భారత డీజీపీ–ఐజీపీ సదస్సులో యోగాకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి, నిత్యజీవితంలో భాగం చేయాలన్న ఆశయానికి అనుగుణంగా మూడు రోజుల పాటు ప్రత్యేక యోగా సాధన నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు ఉన్నతాధికారుల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించేలా రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లు గురించి అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం చర్చించారు. యోగా సాధన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌) ప్రాంగణంలో అఖిల భారత డీజీపీ–ఐజీపీ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు ప్రముఖులు, దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. జాతీయ స్థాయి సమావేశంలో యోగా కార్యక్రమాలను భాగం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించనున్నారు.

పోలీసు అధికారులు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే పని ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా దోహదపడుతుంది. శ్వాస నియంత్రణ, ఏకాగ్రత, శరీరాన్ని చురుకుగా ఉంచే సాధనల ద్వారా అధికారుల్లో ఉత్సాహం, మానసిక సమతుల్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ఆయుష్ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థతో పాటు అమరావతిలోని మంతెన ఆశ్రమం నుంచి ప్రత్యేక యోగా నిపుణుల బృందాలు పాల్గొననున్నాయి. ఈ బృందాలు సదస్సుకు హాజరయ్యే అధికారులకు యోగా సాధన చేయించడంతో పాటు వివిధ విధానాలను వివరించనున్నాయి.

### కామన్ యోగా ప్రొటోకాల్‌ ప్రకారం సాధన

సదస్సులో ప్రతిరోజూ ఉదయం నిర్ణీత సమయంలో ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన కామన్ యోగా ప్రొటోకాల్‌ ప్రకారం 45 నిమిషాల పాటు సాధన సాగనుంది. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియలకు చోటు కల్పించనున్నారు. పోలీసు అధికారుల పని ఒత్తిడిని తగ్గించి, శారీరక చురుకుదనం, మానసిక ప్రశాంతత పెంపొందించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

జాతీయ సంస్థకు చెందిన నిపుణులతో శిక్షణ

యోగా కార్యక్రమాల నిర్వహణ కోసం మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థకు చెందిన నీతూ సైనీ, పి. సుందర్ రాజు, ఖుష్బూ శర్మ, శుభం ఆర్యలను యోగా శిక్షకులుగా, రాహుల్ సింగ్ చౌహాన్‌ను ఆంగ్ల వ్యాఖ్యాతగా నియమించారు. వీరితో పాటు మంతెన ఆశ్రమానికి చెందిన నిపుణుల బృందం యోగా ప్రదర్శన, సాధన కార్యక్రమాల్లో పాల్గొననుంది.

జాతీయ స్థాయి సదస్సులో యోగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి కేస్వానీ రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్‌కు లేఖ ద్వారా సూచించారు. యోగాపై ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న ప్రత్యేక ఆసక్తి, భారతీయ యోగాకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపు నేపథ్యంలో ఈ సదస్సులో యోగా కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.