-నాలుగు విడతల్లో 125 మంది డిపో మేనేజర్లకు శిక్షణ – పారదర్శకత, జవాబుదారీతనంపై జేఎండీ ఎం. శివప్రసాద్ దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో సాంకేతిక అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, ఆదాయ నష్టాలను అరికట్టడంతో పాటు సంస్థ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అకాడమీ, సంస్థ ప్రధాన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడత శిక్షణ మంగళవారం (నవంబర్ 10) విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది డిపో మేనేజర్లు మొదటి విడతలో పాల్గొన్నారు. నవంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) ఎం. శివప్రసాద్ ఐఎఫ్ఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) జి.వి. రవివర్మతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరై డిపో మేనేజర్లకు పలు కీలక సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్భంగా జేఎండీ ఎం. శివప్రసాద్ మాట్లాడుతూ, సంస్థ ఆదాయాన్ని కాపాడటం, ప్రతి విభాగంలో పారదర్శకతను పాటించడం, విధుల నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం ప్రతి డిపో మేనేజర్ ప్రధాన బాధ్యతలని స్పష్టం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తలెత్తే అక్రమాలను గుర్తించడం, ఆదాయ గండులను అరికట్టడం, రికార్డులు, ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ శిక్షణలో పర్సనల్, అకౌంట్స్, మెకానికల్, ఆపరేషన్స్, కమర్షియల్, లాజిస్టిక్స్, ఐటీ తదితర కీలక విభాగాలకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు, నిపుణులు డిపో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణ, తనిఖీ విధానాలు, లోపాల గుర్తింపు, అక్రమాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆచరణాత్మక అవగాహన కల్పిస్తున్నారు.
నాలుగు విడతల్లో 125 మందికి శిక్షణ
నవంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు మొత్తం నాలుగు విడతల్లో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొదటి విడతలో 30 మంది, రెండో విడతలో 27 మంది, మూడో విడతలో 34 మంది, నాలుగో విడతలో 34 మంది చొప్పున మొత్తం 125 మంది డిపో మేనేజర్లు శిక్షణ పొందనున్నారు.
ట్రాన్స్పోర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ పాణి చక్రతేజ పర్యవేక్షణలో అకాడమీ సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, సంస్థలో ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడం, సాంకేతిక అక్రమాలను నియంత్రించడం, ఏపీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పరిరక్షించడం ఈ ప్రత్యేక శిక్షణ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
డిపోలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను మేనేజర్లకు అందించడం ద్వారా సంస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
