ఓట్ల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన ఎన్నికల ఓట్ల లెక్కల్లో వ్యత్యాసాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న అంతర్గత నివేదికలను బహిర్గతం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంపై చర్చించి, దేశవ్యాప్త పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల అక్రమాలపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దశ నుంచే అక్రమాలు, బెదిరింపులు, దాడులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు, తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం తగిన సహాయం అందించడం లేదని విమర్శించారు. బాధితులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాబోయే పంచాయతీ ఎన్నికలు, పెండింగ్ మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కూటమి నేతలు ఎన్నికల విజయాల లెక్కల్లో మునిగిపోయారని విమర్శించారు.

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.