-75,350 స్లాట్లకు 63,637 భర్తీ
-ఆరు జిల్లాల్లో పూర్తయిన బుకింగ్
-ప్రారంభమైన వైకల్య నిర్ధారణ పరీక్షలు
-30 రోజుల్లోగా ధ్రువపత్రాల జారీకి చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో దివ్యాంగులకు సదరం వైకల్య ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నవంబర్ 2 నుంచి ప్రారంభమైన స్లాట్ల బుకింగ్‌లో గురువారం నాటికి మొత్తం 75,350 స్లాట్లకు 63,637 మంది నమోదు చేసుకున్నారు. దీంతో 84.47 శాతం స్లాట్లు నిండగా.. మరో 11,713 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వైకల్య నిర్ధారణ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. అనంతపురం, బాపట్ల, మార్కాపురం, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కేటాయించిన స్లాట్లన్నీ నిండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 117 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైకల్యాల వారీగా బుకింగ్ వివరాలు
Locomotor కు సంబంధించిన వైకల్యం విభాగంలో 29,902 స్లాట్లకు 29,136 మంది నమోదు చేసుకున్నారు. వినికిడి లోపం విభాగంలో 8,680 స్లాట్లకు 8,530 మంది, కంటి చూపు లోపం విభాగంలో 8,643 స్లాట్లకు 6,610 మంది, అంధత్వం విభాగంలో 2,880 స్లాట్లకు 2,821 మంది బుక్ చేసుకున్నారు. మానసిక వైకల్యం విభాగంలో 3,240 స్లాట్లకు 3,224 మంది, Intellectual Disbaility విభాగంలో 3,240 స్లాట్లకు 2,444 మంది నమోదు చేసుకున్నారు. దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యల విభాగంలో కేటాయించిన 1,280 స్లాట్లన్నీ నిండాయి. ఇతర వైకల్యాల విభాగాల్లోనూ బుకింగ్‌లు కొనసాగుతున్నాయి.
జిల్లాల వారీగా స్లాట్ల లభ్యత
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,696 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 1,194, విజయనగరంలో 1,138, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,111 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
విశాఖపట్నంలో 727, కాకినాడలో 617, తూర్పు గోదావరిలో 550, ప్రకాశంలో 516, పార్వతీపురం మన్యంలో 509, గుంటూరులో 442, తిరుపతిలో 436, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 402 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ స్లాట్ల బుకింగ్ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
వివిధ మార్గాల్లో స్లాట్ల బుకింగ్
నవంబర్ 2 నుంచి సదరం వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం స్లాట్లను విడుదల చేశారు. దివ్యాంగులు తమకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేందుకు స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ ద్వారా అందించే ‘మన మిత్ర’ సేవలు, ఏపీ సేవా పౌర సేవల పోర్టల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
30 రోజుల్లోగా ధ్రువపత్రాల జారీ
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ చక్రధర్ బాబు గురువారం నిర్వహించిన సమీక్షలో సదరం సేవలపై చర్చించారు. స్లాట్ బుకింగ్ నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు, వైద్య బోర్డు ధ్రువీకరణ, ధ్రువపత్రం జారీ వరకు మొత్తం ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని వెల్లడించారు. ఆసుపత్రుల్లోగానీ, ఆరోగ్య శాఖలోగానీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు
