-వికేంద్రీకరణ ప్రణాళికలతో ప్రాంతాల వారీగా అభివృద్ధి
-పెట్టుబడుల సాధనలోనే కాదు… గ్రౌండింగ్లోనూ వేగమే మా లక్ష్యం
-భవిష్యత్ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నాం
-ప్రధాని జన విశ్వాస్ పిలుపునకు అనుగుణంగా ఏపీలో పాలన
-నరేంద్ర మోదీ ద్వారానే వాటర్ గ్రిడ్ కల సాకారం
-సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
వేగవంతమైన అభివృద్ధికి జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రెండు రోజుల 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన వివిధ దేశాల పారిశ్రామిక ప్రతినిధులు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. అలాగే రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పెట్టుబడులకు అవకాశం ఉందో ప్రజెంట్ చేశారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి జరిగిన ప్రగతిని సీఎం వివరించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు పెట్టుబడుల భద్రతకు సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం, ఉత్సాహం కల్గించేందుకు పారిశ్రామిక రాయితీలకు సంబంధించి ఎస్క్రో ఖాతాను తెరుస్తున్నామని చెప్పారు. దీంతో పాటు పెట్టుబడుల రక్షణ చట్టం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో పెట్టుబడుల చట్టం చేసి కేంద్రానికి పంపుతామని… దాన్ని కేంద్రం ఆమోదించాలని కోరారు. జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడుల భద్రతా చట్టాన్ని చేస్తే భారతదేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని సీఎం అభిప్రపాయపడ్డారు. ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలికాకూడదని, వచ్చే పెట్టుబడులకు శాశ్వత భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం, ఇచ్చిన హామీల అమలుపై భరోసా కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జన్ విశ్వాస్ పిలుపునకు అనుగుణంగా ఏపీలో పాలన సాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు రియల్ టైమ్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రక్రియల్లో జాప్యం లేకుండా వేగంతో అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూమి కేటాయింపులు, ప్రోత్సాహకాలను వేగంగా అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఈ విధానం అమలుకు కియా కార్ల పరిశ్రమ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి భూమి కేటాయించామని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా 19 నెలల్లోనే సిద్దమైందని… ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
నమ్మకంతో పెట్టుబడులు…
ఈ సదస్సులో వచ్చే పెట్టుబడులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టువుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందించడం వల్ల వాటి చెల్లింపుల్లో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారనున్న సాంకేతిక, పారిశ్రామిక రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్లు, సౌర విద్యుత్తు, బ్యాటరీ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున అవకాశాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, అంతరిక్ష రంగానికి స్పేస్ విజన్, సెమీకండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ రంగాల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామని చెప్పారు. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడంతో పాటు, క్వాంటం పరికరాలను మేడ్ ఇన్ అమరావతి బ్రాండుతో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పౌర అవసరాలు, రక్షణ రంగ అవసరాలకు ఉపయోగపడే డ్రోన్ల తయారీ కోసం ప్రత్యేకంగా డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నామని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో నదుల అనుసంధానం కీలకం
రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక అభివృద్ధికి నీటి లభ్యత అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అందించేలా కార్యాచరణ చేపట్టామని వివరించారు. గోదావరి జలాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడం ద్వారా విశాఖపట్నం, అమరావతి వంటి కీలక నగరాల నీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందన్నారు. గోదావరి కుడి, ఎడమ కాలువల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, గోదావరి నుంచి కావేరి నదికి నీటిని తరలించే అవకాశాలపైనా దృష్టి సారించామని తెలిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా ఐదు రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ సరఫరాకు గ్రిడ్ ఉన్నట్లుగానే నీటి సరఫరాకు కూడా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నీటి లభ్యతను పెంచడం ద్వారా వ్యవసాయ రంగానికి భరోసా కల్పించడంతో పాటు, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా నీటిని అందించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ కలను సాకారం చేయగలిగేది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతి నుంచి తిరుపతి వరకు అభివృద్ధి కేంద్రాలు
అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐకానిక్ భవనాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఆపరేషనల్ పోర్టులు, విమానాశ్రయాలు, హైస్పీడ్ రైలు నెట్వర్క్, రహదారి అనుసంధాన వ్యవస్థలు ఉన్నాయని, ఇవి ఏపీని దేశంలో కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా నిలబెట్టేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పరిశ్రమల రవాణా, ఎగుమతులు, దిగుమతులకు అనువైన మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నానికి గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పారిశ్రామిక ప్రతినిధులను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సామాజిక, ఆర్థిక భద్రతతో పాటు సమాన అవకాశాల కల్పనలోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తోందని చంద్రబాబు తెలిపారు. యాక్సెస్ టు ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను పెంచడం, వారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని… అలాగే రెండున్నరేళ్ల కాలంలో చిన్న పాటి గ్యాప్ కూడా లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని… సుస్థిరాభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్, జీఎమ్ఆర్ సంస్థ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, కియా సీఈఓ ఇండియా ఎండీ గ్వాంగ్ లీ, సాగర్ డిఫెన్స్ సీఈఓ నికుంజ్ పరాశర్ తదితరులు హాజరయ్యారు.
