-64వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వీరమాచనేని లలితా కిషోర్‌కు ఎమ్మెల్యే బొండా ఉమ అభినందనలు
-కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతకు నిదర్శనం ఏకగ్రీవ విజయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 64వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరమాచనేని లలితా కిషోర్ ఏకగ్రీవంగా బుధవారం ఎన్నికయ్యారు. ప్రత్యర్థి అభ్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఏకగ్రీవ ఎన్నికను ధ్రువీకరిస్తూ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ:- 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరమాచనేని లలితా కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథానికి, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అందిస్తున్న మద్దతుకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు.
స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 64వ డివిజన్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన సహకారం అభినందనీయమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వీరమాచనేని లలితా కిషోర్‌ను బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
