-మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
డయాబెటిక్ రెటినోపతి, కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ విజయవాడ ప్రధాన శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించారు. శనివారం ఉదయం జరిగిన ఈ వాకథాన్ మాక్స్ విజన్ ఆసుపత్రి నుంచి ప్రారంభమై ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ స్వాతి, ఆసుపత్రి సిబ్బంది, అమృత హస్తం సోషల్ సర్వీస్ ఫౌండేషన్‌కు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కరుణశ్రీ బృందం, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మధుమేహం కారణంగా కళ్లపై పడే ప్రభావం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కలిగే దృష్టి సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మధుమేహ బాధితులు ఎలాంటి కంటి సమస్యలు కనిపించకపోయినా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా దృష్టి నష్టాన్ని నివారించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ వాకథాన్ ద్వారా ప్రజల్లో నివారణ ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడం, సకాలంలో కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం తమ ప్రధాన లక్ష్యమని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మాక్స్ విజన్ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వెల్లడించారు.
మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ విజయవాడ ప్రధాన శాఖలో రెటీనా సంరక్షణ, గ్లాకోమా చికిత్స, కెరటోకోనస్ నిర్వహణ, ప్యూపిలోప్లాస్టీ, ఆర్బిట్, ఓక్యులోప్లాస్టీ, సాధారణ నేత్ర వైద్య సేవలతో పాటు ఆప్టికల్స్, ఫార్మసీ సేవలను అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య సదుపాయాలతో అందిస్తున్నట్లు ఆసుపత్రి ప్రతినిధులు వివరించారు.
