శబరిమల యాత్రలో పర్యావరణ పరిరక్షణకు భక్తులు సహకరించాలి

-అయ్యప్ప భక్తులకు కేరళ కాలుష్య నియంత్రణ మండలి సూచనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి మండల–మకరవిళక్కు తీర్థయాత్ర సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు భక్తులందరూ సహకరించాలని కేరళ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విజ్ఞప్తి చేసింది. 2026–27 సంవత్సరానికి సంబంధించిన యాత్ర నవంబర్ 17, 2026 నుంచి జనవరి 20, 2027 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో శబరిమల పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడుతూ, ప్రకృతి పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.
సన్నిధానం, పంబా, నీలక్కల్, ఎరుమేలి, అటవీ ప్రాంతాలు, కొండ మార్గాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా భక్తులు పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని అయ్యప్ప భక్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని కోరుతూ కేరళ కాలుష్య నియంత్రణ మండలి ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి లేఖ రాసింది. దీంతో ఏపీపీసీబీ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసి భక్తులకు పలు సూచనలు చేసింది.
యాత్ర సందర్భంగా ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించింది. అటవీ మార్గాలు, కొండ ప్రాంతాలు, పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను పడవేయరాదని తెలిపింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, జీవఅధోకరణం చెందే వ్యర్థాలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీల్లోనే వేయాలని పేర్కొంది.
పంబా నదిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయకుండా నది పవిత్రతను, పరిశుభ్రతను కాపాడాలని కోరింది. అలాగే పంబా నది, భస్మకుళంలో ఉపయోగించిన దుస్తులను విడిచిపెట్టరాదని సూచించింది. శబరిమల పవిత్రతను, పంబా నది స్వచ్ఛతను, అటవీ ప్రాంతాల సహజ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి అయ్యప్ప భక్తుడి బాధ్యతని కేరళ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. పర్యావరణహితమైన, ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే యాత్రకు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.