-అధికారులకు కమిషనర్ కె. మయూర్ అశోక్ కీలక ఆదేశాలు.. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
వాయుగుండం తుపానుగా బలపడి నవంబర్ 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, నవంబర్ 19న ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించిన నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. ఈ మేరకు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తుఫాన్ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0863 2345103 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నగరంలోని లోతట్టు, ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డ్రైన్లలో నీరు నిల్వ ఉండకుండా పూడిక, అడ్డంకులను తొలగించాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలని, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, నీటిని తోడే మోటార్లు, జనరేటర్లతో ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చెట్లు కూలిన సందర్భాల్లో వెంటనే తొలగించేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నగర ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని సూచించారు. తుఫాన్‌కు సంబంధించిన వదంతులను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు.
తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీఎంసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు.
