-ఔట్సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీఎస్ఆర్టీసీలో గ్రౌండ్ బుకింగ్, నాన్‌స్టాప్ కౌంటర్లలో పనిచేస్తున్న కండక్టర్లను తొలగించి, వారి స్థానంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోన్ డిమాండ్ చేసింది.
గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నాన్‌స్టాప్ కౌంటర్లలో టికెట్ల జారీ కోసం కండక్టర్లను వినియోగిస్తూ విశేష సేవలందిస్తున్నారని యూనియన్ జోనల్ కార్యదర్శి వై.ఎస్. రావు తెలిపారు. అయితే ఇటీవల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల పేరుతో విజయవాడ జోన్ పరిధిలోని గ్రౌండ్ బుకింగ్, నాన్‌స్టాప్ కౌంటర్లలో పనిచేస్తున్న కండక్టర్లను తొలగించి, ఆ బాధ్యతలను ప్రైవేటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ జోన్ వ్యాప్తంగా సోమవారం నుంచి కండక్టర్లు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని యూనియన్ పిలుపునిచ్చింది. అలాగే నవంబర్ 17, 2026 నుంచి జోన్ పరిధిలోని అన్ని యూనిట్లలో నాన్ కోఆపరేషన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
కండక్టర్ల విధులను కండక్టర్ల చేతనే నిర్వహించాలని, వారి విధులను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనలకు సైతం సిద్ధంగా ఉన్నామని వై.ఎస్. రావు హెచ్చరించారు.
