నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు

-21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నవజాత శిశు వారోత్సవాలు
-ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరిన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
-పుట్టిన ప్రతి బిడ్డకు నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ, నిరంతర వైద్య సేవలు, సంపూర్ణ ఎదుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవజాత శిశు వారోత్సవాలు–2026 నిర్వహిస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిశు ఆరోగ్య విభాగం సూచనలు, రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) మిషన్‌ డైరెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది నినాదం

*“చిన్నారి శిశువులు – అపార సంపద”*

*“చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతర వైద్య సంరక్షణ అందిద్దాం!”*

ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు నిరంతర వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడటంపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

చిన్నారులకు నిరంతర వైద్య సంరక్షణ

వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు (ఎస్‌ఎన్‌సీయూ), నవజాత శిశు అత్యవసర చికిత్స కేంద్రాల (ఎన్‌ఐసీయూ) నుంచి ఇళ్లకు చేరిన శిశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, తదుపరి సంరక్షణ అందిస్తారు. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర నోడల్‌ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.

జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు (డీఎంహెచ్‌ఓలు) ఆన్‌లైన్‌ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్నారుల సురక్షిత ఆరోగ్యం, సంరక్షణ (ఎస్‌ఎస్‌బీఎస్‌కే) కార్యక్రమం కింద వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారులు (సీహెచ్‌ఓలు), ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు.

శిశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ

‘శైశవ్‌’ యాప్‌లో ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూ కేంద్రాల నుంచి ఇళ్లకు చేరిన ప్రతి శిశువు వివరాలను నమోదు చేస్తారు. తద్వారా వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించి, తదుపరి వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తారు.

ఇంటింటికీ సంయుక్త ఆరోగ్య సేవలు

ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు శిశువు పుట్టిన 1, 3, 7వ రోజుల్లో, అంగన్‌వాడీ కార్యకర్తలు 28వ రోజున ఇంటికి వెళ్లి ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు. వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తారు.

చిన్నారుల్లో న్యుమోనియా నివారణకు ‘సాన్స్‌’ కార్యక్రమం

న్యుమోనియా నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స కోసం ‘సాన్స్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.