-విద్యుత్ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధం
-మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు భట్టి విక్రమార్క ఫోన్
-తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి కృతజ్ఞతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు బుధవారం ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. తుపాను కారణంగా ఇప్పటివరకు జరిగిన నష్టం, ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చేపట్టిన చర్యలను గొట్టిపాటి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నష్ట నివారణ, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సరిచేస్తూ, సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు.
పూర్తి సహకారం అందిస్తాం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కష్టకాలంలో ఏపీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని అభినందించారు.
