నాన్‌స్టాప్ కౌంటర్లలో కండక్టర్ల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

-ఔట్‌సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీఎస్‌ఆర్టీసీలో గ్రౌండ్ బుకింగ్, నాన్‌స్టాప్ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లను తొలగించి, వారి స్థానంలో ప్రైవేటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోన్ డిమాండ్ చేసింది.
గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నాన్‌స్టాప్ కౌంటర్లలో టికెట్ల జారీ కోసం కండక్టర్ల సేవలను వినియోగిస్తున్నారని, వారు ప్రయాణికులకు విశేషమైన సేవలందిస్తున్నారని యూనియన్ జోనల్ కార్యదర్శి వై.ఎస్.రావు తెలిపారు.
అయితే, ఇటీవల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల పేరుతో విజయవాడ జోన్ పరిధిలోని గ్రౌండ్ బుకింగ్, నాన్‌స్టాప్ కౌంటర్లలో పనిచేస్తున్న కండక్టర్లను తొలగించి, ఆ బాధ్యతలను ప్రైవేటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించేందుకు యాజమాన్యం ప్రయత్నించడం అన్యాయమని ఆయన ఆక్షేపించారు.
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం (నవంబర్ 17) నుంచి జోన్ పరిధిలోని కండక్టర్లు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని యూనియన్ పిలుపునిచ్చింది. అదే విధంగా నవంబర్ 17 నుంచి జోన్ పరిధిలోని అన్ని యూనిట్లలో నాన్ కోఆపరేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
యాజమాన్యం తక్షణమే స్పందించి కండక్టర్ల విధులను కండక్టర్లతోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విధులను ఓడీలుగా పరిగణించి తొలగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనలకు సైతం సిద్ధంగా ఉన్నామని వై.ఎస్.రావు హెచ్చరించారు.