ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

-మూడు విడతల్లో 288 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు – 8.35 లక్షల మంది ఓటర్లు
-3,287 పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధులకు 9,782 మంది సిబ్బంది గుర్తింపు
-511 వాహనాల ఏర్పాటు – 2,800 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
-సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
-ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు
-ఎన్నికలకు సంబంధించి ఏదైనా సందేహాలు, సమాచారం తెలియజేయాలంటే కంట్రోల్ 9154970454 ను సంప్రదించాలి
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులు, 3,287 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 8,35,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీరిలో 4,06,803 మంది పురుషులు, 4,28,680 మంది మహిళలు, 32 మంది ఇతర ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.

మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ

శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో సౌలభ్యం, రవాణా మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల వారీగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.

* మొదటి విడత: విజయవాడ డివిజన్ పరిధిలో 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులు, 1,001 పోలింగ్ కేంద్రాలు.

* రెండవ విడత: నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో 138 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డులు, 1,468 పోలింగ్ కేంద్రాలు.

* మూడవ విడత: తిరువూరు డివిజన్ పరిధిలో 77 గ్రామ పంచాయతీలు, 800 వార్డులు, 818 పోలింగ్ కేంద్రాలు.

విడతల వారీగా ఎన్నికల షెడ్యూల్
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండవ విడత పోలింగ్ నవంబర్ 29న, మూడవ విడత పోలింగ్ డిసెంబర్ 2న నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

మొదటి విడత – విజయవాడ డివిజన్
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 17.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 21.
పోలింగ్, ఓట్ల లెక్కింపు: నవంబర్ 26.
రెండవ విడత – నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలు
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 24.
పోలింగ్, ఓట్ల లెక్కింపు: నవంబర్ 29.
మూడవ విడత – తిరువూరు డివిజన్
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 23.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 27.
పోలింగ్, ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 2.
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు తదితర పరోక్ష ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సమావేశాల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల విధులకు 9,782 మంది సిబ్బంది
జిల్లాలోని 3,287 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 3,615 మంది ప్రిసైడింగ్ అధికారులు, 6,167 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని కలిపి మొత్తం 9,782 మందిని ఎన్నికల విధుల కోసం గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బందికి దశలవారీగా శిక్షణ అందించి, నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

2,800 మంది పోలీసులతో పటిష్ట భద్రత
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లాలో సుమారు 2,800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 50 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు మార్చ్‌లు నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన చోట అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 16 మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సిబ్బంది, సామగ్రి, పర్యవేక్షణ బృందాల రవాణా కోసం 395 బస్సులు, 116 ఇతర వాహనాలు కలిపి మొత్తం 511 వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు.

సర్పంచ్‌కు పింక్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ పత్రాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించే స్వతంత్ర గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పత్రాల ముద్రణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థుల కోసం పింక్ రంగు బ్యాలెట్ పత్రాలు. వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిపై ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రిటర్నింగ్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఫర్నిచర్, షామియానాలు వంటి కనీస సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్‌చైర్లు, ర్యాంపులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సెల్ 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు

గ్రామాల్లో ఐక్యత, సామరస్యం, అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
* 5,000 లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు.
* 5,001 నుంచి 10,000 వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు.
* 10,000 పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు.
జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా పెద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, మిగిలిన ఎన్నికల ప్రక్రియ కూడా ఇదే విధంగా ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని, అర్హులైన ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.