ప్రజా ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలి

-ఆన్‌లైన్‌లో పరిష్కరించినట్లు చూపితే సరిపోదు.. క్షేత్రస్థాయిలో ప్రజలు సంతృప్తి చెందాలి: కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, అవే సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్‌తో పాటు ఇతర వేదికల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిపై అన్ని విభాగాల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కేవలం ఆన్‌లైన్ రికార్డుల్లో ఫిర్యాదులను పరిష్కరించినట్లు నమోదు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేసి దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.
ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైతే, వాటిని దరఖాస్తుదారులకు వివరించి తగిన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో మొత్తం 26 అర్జీలు అందినట్లు కమిషనర్ తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 10, ఇంజినీరింగ్ విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 3, ప్రజారోగ్య విభాగానికి 5, ఉపా సెల్ విభాగానికి సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సి.హెచ్. శ్రీనివాస్, ఎస్‌ఈ జి. వెంకటేశ్వరరావు, సీపీ రాంబాబు, ఈఈలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.