-మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అక్వాన్ తుపానుగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. గడిచిన 6 గంటల్లో ఇది 10 కిమీ వేగంతో కదులుతుందని, రేపు సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందన్నారు. ఇది చెన్నైకి 610 కి.మీ, మచిలీపట్నానికి 660 కిమీ విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
ప్రస్తుత వాతావరణ అంచనాలను బట్టి పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు- తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిమీ, గరిష్ఠంగా 145 వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో ఎల్లుండి నుంచి అక్కడక్కడ బారీ వర్షాలు; గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అక్వాన్ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అలెర్ట్ చేశామన్నారు. తుపాను వలన ఏ సమస్య ఎదురైనా 9552300009 మన మిత్ర ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలన్నారు.
తుపాను హెచ్చరికల నేపధ్యంలో గురు,శుక్రవారాల్లో వర్షసూచన క్రింది విధంగా ఉండనున్నట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ వివరించారు.
గురువారం (19-11-2026) : ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షాలు , విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
శుక్రవారం (20-11-2026) : ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షాలు , విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
కోస్తాంధ్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావం నుంచి ప్రాణ, ఆస్తినష్టాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తుపానుకు ముందు ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకుంటూ విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని గమనిస్తుండాలని సూచించారు. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవడంతో పాటు, కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు ఉండేలా కిట్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇంటి పైకప్పు, తలుపులు- కిటికీలు సురక్షితంగా ఉన్నయో లేదో తనిఖీ చేయడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తుపాను సమయంలో ఇంట్లో ఉన్నవారు ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి, తలుపులు, కిటికీలు గట్టిగా మూసి ఉంచాలన్నారు. ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు. కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఒకవేళ ఆకస్మికంగా భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే, బలమైన టేబుల్/బెంచ్ కింద తలదాచుకుని రక్షణ పొందాలన్నారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయాలకు తరలివెళ్లాలని కోరారు. ఒకవేళ తుపాను సమయంలో బయట ఉంటే, దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి వెళ్లకూడదని; చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు అధికారిక ప్రకటన వెలువడే వరకు షెల్టర్లను వదిలి ఇళ్లకు వెళ్లవద్దు. తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర అప్రమత్తతతో ఉండలన్నారు. నీటిలో తడిసిన లేదా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించిన తర్వాతే ఉపయోగించాలని స్పష్టం చేశారు.
మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. తమ పడవలు మరియు తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడులతో గట్టిగా కట్టి సురక్షితంగా ఉంచాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
