-పర్యాటకులతో కళకళలాడుతున్న అటవీ ప్రాంతం.. రెండు నెలల్లోనే 9 వేలకు పైగా సందర్శకులు..రాష్ట్రంలోనే ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తింపు
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ప్రముఖ ఎకో-టూరిజం కేంద్రంగా ఎదుగుతున్న ముసలమడుగు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లు.. చుట్టూ పరిసరాల గుండా వీచే చల్లటి గాలి.. అంతలోనే భూమి కంపించినట్లు వచ్చే భారీ అడుగుల చప్పుడు.. ఒకదాని వెనుక ఒకటి రాజసంగా నడుచుకుంటూ వచ్చే గజరాజులు.. ఇదంతా ఏదో దట్టమైన అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యం కాదు.. చిత్తూరు జిల్లా పలమనేరులోని నూతన పర్యాటక కేంద్రమైన ముసలమడుగు కుంకీ ఏనుగుల శిబిరంలో ప్రతిరోజూ కనువిందు చేస్తున్న అద్భుత దృశ్యం..అడవి బిడ్డలైన ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు, వాటి జీవన శైలిని దగ్గర నుంచి చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి పోటెత్తుతున్నారు…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 2025 నవంబర్ 9న ఘనంగా ప్రారంభమైన ఈ శిబిరం ఇటీవలే ప్రజల సందర్శనార్థం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సందర్శకుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.. ఈ శిబిరం ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ శిబిరాన్ని 9,784 మంది పర్యాటకులు సందర్శించడం విశేషం. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 4.5 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఈ ప్రాంత పర్యాటక సామర్థ్యానికి నిదర్శనం. ఏపీలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ముసలమడుగు శిబిరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో త్వరలోనే సౌత్ ఇండియాలోనే ఒక ప్రధాన ఎకో-టూరిజం హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అపారమైన అటవీ సంపద, ఇక్కడ లభించే ప్రశాంత వాతావరణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి.ఈ ప్రాముఖ్యతను గుర్తించిన పర్యాటక, అటవీ అధికారులు ఈ ప్రాంతాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను విజయవంతంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన అంకితభావం గల అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చిత్తూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, వారి పూర్తి బృందం చేసిన కృషి ఎంతో అభినందనీయం. పర్యాటకులు సెలవు రోజుల్లో తమ కుటుంబంతో కలిసి ఒక రోజంతా ప్రకృతి ఒడిలో, ఏనుగుల మధ్య ఆనందంగా గడపాలనుకుంటే పలమనేరు ముసలమడుగు కుంకీ ఏనుగుల శిబిరం సరైన వేదిక అని స్వయంగా అక్కడ అనుభూతులు పొందిన పర్యాటకులు చెబుతున్నారు. రాబోయే వీకెండ్లో మీ ప్రయాణాన్ని కూడా ఇక్కడికి ప్లాన్ చేసుకొని, ఈ అద్భుత అనుభూతిని మీ సొంతం చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు సూచిస్తున్నారు..
