-చదవటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా టాగూర్ గ్రంథాలయంలో నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని టాగూర్ గ్రంథాలయంలో నవంబర్ 22న ‘చదవటం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కథా రచన, కథలోని పాత్రల చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు స్వయంగా కథలు రాసి, వాటిలోని పాత్రలకు అందమైన చిత్రాలను గీశారు. అనంతరం తాము రాసిన కథలను, అందులోని పాత్రలను చిత్రాల సహాయంతో తోటి విద్యార్థులకు ఆసక్తికరంగా వివరించి వినిపించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో కథా రచనా నైపుణ్యం, చిత్రలేఖన ప్రతిభ, ఊహాశక్తి, సృజనాత్మకతతో పాటు భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందుతాయని తెలిపారు. పుస్తక పఠనంతో పాటు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను రమాదేవి అందజేశారు.
పోటీల విజేతలు: ప్రథమ బహుమతి: వేదాన్షి శ్రీనిజ – 8వ తరగతి, ద్వితీయ బహుమతి: జ్యోతి ప్రజ్వలన – 7వ తరగతి, తృతీయ బహుమతి: లక్కీ – 4వ తరగతి.
ఈ కార్యక్రమంలో సంగీత ఉపాధ్యాయుడు రామకృష్ణ, చేతివృత్తుల శిక్షకురాలు అరుణ, తెలుగు ఉపాధ్యాయురాలు సుమతితో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
