ఎన్నికల విధుల్లో అప్రమత్తతే కీలకం..

– పోలింగ్ నిర్వ‌హ‌ణ‌లో ఏ ద‌శ‌లోనూ పొరపాట్లకు తావివ్వొద్దు
– నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి
– పీవోల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల (పీవోలు) పాత్ర అత్యంత కీలకమని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
పంచాయతీ ఎన్నికలు–2026 రెండోద‌శ నిర్వహణకు సంబంధించి శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియలో ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయడంతో పాటు ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను తూచా తప్పకుండా పాటించాలని, విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఒకేరోజు నిర్వహించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఒత్తిడి, పోటాపోటీ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, ఈ నేప‌థ్యంలో అధికారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత చిత్తంతో, సంయమనంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకుని అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ సిబ్బంది త‌దిత‌రుల‌తో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్సు సిద్ధం చేయడం, సీల్ వేయడం, ఓటరు గుర్తింపు, బ్యాలెట్ పేపర్ జారీ, ఓటు వేసే విధానం, ఓటు రహస్యాన్ని కాపాడటం, చెల్లుబాట‌య్యే, చెల్లని ఓట్లపై అవగాహన, పోలింగ్ ముగింపు, కౌంటింగ్ త‌దిత‌ర అంశాల‌ను మాస్ట‌ర్ ట్రైన‌ర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు.
శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.సీతామహాలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.ప్రభాకరరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.