ప్రపంచ మేయర్ల వేదికలో పాల్గొన్న గుంటూరు మేయర్, కమిషనర్

-నగరాల భవిష్యత్ ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర పట్టణాభివృద్ధిపై అంతర్జాతీయ చర్చల్లో భాగస్వామ్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలో జరుగుతున్న మూడవ ప్రపంచ మేయర్ల వేదిక–2026 మొదటి రోజు సమావేశాల్లో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు. ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో నవంబర్ 25న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సదస్సును ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తోంది.
ఈ వేదికకు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల మేయర్లు, నగర పాలక సంస్థల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, పట్టణాభివృద్ధి నిపుణులు హాజరయ్యారు. తొలిరోజు నిర్వహించిన పలు చర్చా కార్యక్రమాల్లో గుంటూరు నగర ప్రతినిధులు పాల్గొని పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
2047 నాటికి నగరాల రూపురేఖలను మార్చే భవిష్యత్ ప్రణాళికలు, మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో నగరాల మధ్య పరస్పర సహకారం, కృత్రిమ మేధ (AI), సాంకేతిక పరిజ్ఞానంతో పట్టణ పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై సమావేశాల్లో చర్చించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే నగరాల నిర్మాణం, పట్టణ వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (Circular Economy) ద్వారా వనరుల సమర్థ వినియోగం, వ్యర్థాల నుంచి విలువను సృష్టించడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
అలాగే ప్రపంచ పెట్టుబడులను స్థానిక అభివృద్ధికి అనుసంధానం చేయడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరమైన నగరాల నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలపై వివిధ దేశాల నగర ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు.
సుస్థిరమైన, సమగ్ర, విపత్తులను తట్టుకోగల పట్టణాల నిర్మాణానికి అవసరమైన ఉత్తమ విధానాలు, ఆచరణాత్మక అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఈ ప్రపంచ మేయర్ల వేదిక దోహదపడుతోంది. నగర పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అంతర్జాతీయ సహకారం, స్థానిక అవసరాలకు అనుగుణమైన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఈ సదస్సు చర్చలు ఉపయోగపడనున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నగరాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్ పట్టణాభివృద్ధికి సంబంధించి కొత్త ఆలోచనలు, విధానాల రూపకల్పనకు ఈ వేదిక అవకాశం కల్పిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.