-ప్రతిపాదిత సుంకాల ఉపశమనంతో ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త అవకాశాలు: FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
భారత్–అమెరికా మధ్య కుదరనున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) న్యాయంగా, పారదర్శకంగా, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) కోరింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) భారతీయ ఉత్పత్తులపై ప్రతిపాదించిన సుంకాల చర్యలు, చర్చలు మరియు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయని FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ తెలిపారు.
అమెరికా చేపట్టిన సెక్షన్ 301 దర్యాప్తులో భారత తయారీ రంగంలో నిర్మాణాత్మక అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న అంశాన్ని భారత్ ఖండించిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని ఏ రంగంలోనూ ఇటువంటి అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధికారులకు స్పష్టం చేసిందన్నారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించడం, వాణిజ్యపరమైన ఆందోళనలను కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న వైఖరిని FIEO స్వాగతించింది.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు FIEO మద్దతు ప్రకటించింది. అయితే, ఈ ఒప్పందం భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు, అమెరికా మార్కెట్లో ఇతర దేశాల ఎగుమతిదారులతో భారతీయ సంస్థలకు సమాన పోటీ అవకాశాలు కల్పించాలని రల్హాన్ సూచించారు.
ప్రతిపాదిత సుంకాలపై పరిశ్రమల్లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే అమల్లో ఉన్న సెక్షన్ 301, సెక్షన్ 232 సుంకాలకు ప్రతిపాదిత చర్యలు ఏ విధంగా వర్తిస్తాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, ఉత్పత్తుల వారీగా మినహాయింపులు, సుంకాల విధింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమన్నారు. దీనివల్ల ఒకే ఉత్పత్తిపై పునరావృత సుంకాల భారం పడకుండా ఎగుమతిదారులు ధరలను నిర్ణయించుకోవడానికి వీలవుతుందని తెలిపారు.
భారతదేశంలో పెరుగుతున్న తయారీ సామర్థ్యం, మెరుగుపడుతున్న నాణ్యతా ప్రమాణాలు, ప్రపంచ సరఫరా గొలుసుల్లో విస్తరిస్తున్న భాగస్వామ్యం దేశాన్ని విశ్వసనీయమైన సరఫరాదారుగా నిలబెడుతున్నాయని ఆయన అన్నారు. సమర్థవంతమైన వాణిజ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతీయ ఉత్పత్తులకు పోటీతత్వాన్ని కల్పించే సుంకాల విధానం, సుంకేతర వాణిజ్య అవరోధాల తొలగింపు, మార్కెట్ ప్రవేశ అవకాశాల మెరుగుదలకు చర్చల్లో ప్రాధాన్యత ఇవ్వాలని FIEO కోరింది. ముఖ్యంగా, అకస్మాత్తుగా పెరిగే సుంకాలు, నిబంధనల అమలు వ్యయాలను తట్టుకునే సామర్థ్యం పరిమితంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ప్రయోజనాలను పరిరక్షించాలని సూచించింది.
ప్రతిపాదిత సుంకాల చర్యలు వివిధ రంగాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి, USTR నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో సమర్పించాల్సిన అభిప్రాయాలు, ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య నిరంతర సంప్రదింపులు అవసరమని FIEO విజ్ఞప్తి చేసింది.
